వెబ్సైట్ ఆలోచన..

రాను రాను భావితరాలకి మా గ్రామంతో ఉన్న సంభందాలు  తెగిపోతున్న  దశలో వారికి ఒక వారధి ని నిర్మించాలన్న ఆలోచన ఈ వెబ్ సైట్ కి నాంది పలికింది.                   

మన చందుపట్ల – భావితరాలకు చారిత్రక వారధి​కాలప్రవాహంలో రానురాను భావితరాలకు  సొంత గ్రామాలతో ఉన్న అనుబంధాలు తెగిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల రీత్యా మన చందుపట్ల గ్రామం నుంచి కూడా చాలామంది జిల్ల…

మన చందుపట్ల – భావితరాలకు చారిత్రక వారధి
​
కాలప్రవాహంలో రానురాను భావితరాలకు  సొంత గ్రామాలతో ఉన్న అనుబంధాలు తెగిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల రీత్యా మన చందుపట్ల గ్రామం నుంచి కూడా చాలామంది జిల్లా కేంద్రాలకు, దేశంలోని వివిధ ప్రాంతాలకు మరియు విదేశాలకు వలస వెళ్లారు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా మాతృభూమిపై మమకారం మాత్రం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచే ఉంటుంది. తమ పిల్లలకు తాము పుట్టి పెరిగిన ఊరి గురించి, దాని గొప్పతనం గురించి చెప్పాలని  ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది.  అయితే, ఆ చరిత్రను ఊరికే చెప్పడం కన్నా, కళ్ళకు కట్టినట్లు సమగ్రంగా చూపించగలిగే ఒక డిజిటల్ వేదిక ఉంటే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా..  ఇప్పటి తరానికి దైనందిన జీవితంలో భాగమైన ఇంటర్నెట్ మాధ్యమాన్నే అందుకు అనువైన మార్గంగా ఎంచుకుని   అలా..  రూపుదిద్దుకున్నదే ఈ "మన చందుపట్ల" వెబ్‌సైట్.

తొలి అడుగు 2015లో
 2015లో  'మన చందుపట్ల' పేరుతో  ప్రారంభించిన వాట్సాప్ (WhatsApp) గ్రూప్ ఏర్పాటుతో ​  తొలి అడుగు పడింది.  గ్రామానికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ తయారుచేయడం అనేది అప్పట్లో ఎవరి ఊహకూ అందని ఒక వినూత్న ఆలోచన.  అయితే.. ఏ పండుగకు ఊరికి వచ్చినా రాకపోయినా, ప్రతి ఏటా బోనాలు, దసరా పండుగలకు మాత్రం  గ్రామస్తులంతా  మా ఊరికి రావడం ఒక ఆనవాయితీ.  ఆ  పండగ రోజుల్లో ఊరంతా ఎంతో కోలాహలంగా,  సందడి వాతావరణం నెలకొంటుంది.  ఎక్కడెక్కడో ఉండే చిన్ననాటి స్నేహితులంతా ఆత్మీయంగా కలుసుకునే అపురూపమైన సందర్భం అది. అయితే, ఊరికి దూరంగా ఉంటున్న మన ఊరి వారికి గ్రామంలోని సామాజిక, రాజకీయ అంశాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం అందుబాటులో ఉంటే, వారు గ్రామానికి మరింత చేరువవుతారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు తెలపడానికి, ఏవైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పరస్పరం స్పందించుకోవడానికి "మన చందుపట్ల"  వాట్సాప్ గ్రూప్ ఎంతో దోహదపడింది.
​మన చందుపట్ల – ఘనమైన చరిత్రకు నిలయం 
మా చందుపట్ల గ్రామానికి ఎంతో ప్రాచీనమైన, ఘనమైన చరిత్ర ఉంది. వందల ఏళ్ల నాటి ఆలయ నిర్మాణాలు, చారిత్రక శాసనాలు ఇప్పటికీ మన గ్రామంలో బయటపడుతూనే ఉన్నాయి. కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి మరణ వివరాలను తెలిపే అరుదైన శాసనం మన చందుపట్లలోనే ఉండటం మనందరికీ ఎంతో గర్వకారణం. అంతేకాకుండా, వందల ఏళ్ల నాటి రామాలయం, శివాలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరియు గణపతి ఆలయాలు మన గ్రామంలో విలసిల్లుతున్నాయి. తెలంగాణలోనే చివరి బోనాలు మన చందుపట్లలోనే జరుగుతాయని ప్రతీతి.
​మన ఊరి గతం ఎంత ఘనకీర్తి కలదైనా, చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలు కళ్ల ముందే కనిపిస్తున్నా, అవి భావితరాలకు సక్రమంగా చేరడం లేదన్నది వాస్తవం.  ఇప్పటికీ గ్రామంలో ఉన్న చాలామందికే మా గ్రామ చరిత్ర తెలియదు. ఇక విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో పుట్టి పెరుగుతున్న మన తర్వాతి తరానికి మన మూలాలు ఎలా తెలుస్తాయి? అందుకే మన గ్రామ చరిత్ర ఎప్పటికీ మాసిపోని విధంగా భద్రపరచాలి, అందరికీ సులభంగా అందుబాటులో ఉండాలి అనే ప్రధాన లక్ష్యంతో ఈ వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టాను.
​ఈ వెబ్‌సైట్ ప్రధాన లక్ష్యాలు:
​చారిత్రక ఆధారాల నిక్షిప్తం:

 గ్రామ చరిత్రను ప్రామాణికంగా నమోదు చేయడం. దీనికోసం చందుపట్ల పేరుతో  పుస్తకాలు రాసిన శ్రీ సమ్మెట గోపాలకృష్ణ గారు, శ్రీ పెరంబదూరు రంగాచార్యులు గారి రచనలను సేకరించాను. సమాచార సాంకేతికత లేని ఆ రోజుల్లోనే వారు ఎంతో పరిశోధించి పుస్తకాలు రాసిన తీరు, వారి తపన నన్ను ఎంతగానో చలింపజేసింది. వారి కష్టంతో పోలిస్తే మేము చేస్తున్న ఈ ప్రయత్నం చాలా చిన్నది అనిపించింది.
​మరిచిపోయిన మహనీయుల స్మరణ:

గ్రామ చరిత్ర కోసం కృషి చేసిన ఆనాటి అరుదైన వ్యక్తులను, మన చందుపట్ల వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేయడం.
​అభివృద్ధి భాగస్వామ్యం..  గ్రామాభివృద్ధికి సహకరించే దాతల, శ్రేయోభిలాషుల వివరాలను అందరికీ తెలియజెప్పి వారిని గౌరవించడం. ​సంస్కృతి - పండుగల ప్రత్యక్ష సమాచారం సగటున ఇంటికొకరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ, దేశ, విదేశాల్లో స్థిరపడిన  గ్రామస్థులందరికీ ఊరిలో జరిగే దేవాలయ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు ఇతర విశేషాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ ద్వారా అందించడం.

ప్రయాణం ప్రారంభమైంది ఇలా.. ​గ్రామంలోని అన్ని ప్రాంతాలను ఫోటోషూట్ చేయడం, పెద్దలను కలిసి పాత జ్ఞాపకాలను రికార్డు చేయడం, సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా ఈ ప్రయాణం ప్రారంభమైంది. గ్రామంలోని ఫోన్ నంబర్లు, ప్రముఖుల వ్యాసాలు, దినపత్రికల క్లిప్పింగ్స్‌ను ఇందులో పొందుపరుస్తున్నాం. మొదట్లో గ్రామస్తులకు ఈ వెబ్‌సైట్ భావన అర్థం కాకపోయినా, దాని ఆవశ్యకతను వివరించడానికి ఎంతో కృషి చేశాను. నా ఆలోచనకు మిత్రులు నైతికంగా, ఆర్థికంగా ఎంతో అండగా నిలిచారు. డిజైనింగ్ మరియు సమాచార సేకరణలో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి, 2016 సంక్రాంతి పండుగ నాడు రామాలయం ఆవరణలో వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో సగర్వంగా 'మన చందుపట్ల' వెబ్‌సైట్‌ను ఆవిష్కరించుకున్నాం.
​ఈ ప్రాజెక్ట్ సంపూర్ణంగా రూపుదిద్దుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చు. కానీ మన చందుపట్ల ఉనికిని, వైభవాన్ని తరతరాలకు పదిలంగా అందించే ఈ యజ్ఞం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మన గ్రామ వారసత్వాన్ని కాపాడుకోవడానికి, భావితరాలకు అందివ్వడానికి మీ అందరి ప్రోత్సాహం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
​- మీ..   
మంగినేపల్లి సాయికుమార్ , సీనియర్ జర్నలిస్టు
మన చందుపట్ల (manachandupatla.in)